Radio Ala 90.8

News Details

75 శాతం అధికధరలతో మద్యం అమ్మకాలు.

మద్య నియంత్రణ, షాపుల వద్ద రద్దీ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగా మద్యం ధరలు ఏకంగా 75 శాతం పెంచి రెండో రోజు అమ్మకాలు జరుపుతోంది. 40 రోజుల లాక్ డౌన్ తర్వాత సోమవారం నుంచి జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత పలునిబంధనల మధ్య జిల్లాలో సడలింపు ప్రకటించినా, 12 కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఇంకా కరోనా పాజిటివ్ కేసులు ఉండడంతో ఆ ప్రాంతాల్లోని 13 మద్యం షాపులను మాత్రం తెరువలేదు. జిల్లాలో షాపులను గణనీయంగా తగ్గించి తద్వారా మద్య నిషేధం వైపుగా ప్రజలను సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం జిల్లాలో ఉన్న 426షాపులకు గానూ 406 షాపుల ద్వారా అసలు ధరకు 25 శాతం పెంచి అమ్మకాలు జరిగాయని జిల్లా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ బత్తుల అరుణ్ రావు వెల్లడించారు. సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సుమారు 12 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం 50 శాతం, అంటే మొత్తం 75 శాతం ధరలు పెంచుతూ విక్రయాలు జరుగుతాయన్నారు.మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విక్రయాలు జరుగుతాయని సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లాలో గల 40 బార్ అండ్ రెస్టారెంట్, 2స్పెన్సర్ షాపుల్లో మద్యం అమ్మకాలకు అనుమతి లేదన్నారు.

Leave a reply