Radio Ala 90.8

News Details

రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో మానవ హక్కుల కమీషన్ వెంటనే ఏర్పాటు చేయాలని ఐలు, ఐఎల్యు , పౌరహక్కుల సంఘం, కెవిపిఎస్, ఐద్వా ఆధ్వర్యంలో సుందరయ్య భవనం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత నాలుగేళ్ళగా మానవ హక్కుల కమిషన్‌ పనిచేయడం లేదన్నారు. పౌరహక్కుల సంఘాలు కోర్టుకు వెళ్లగా నాలుగు నెలల్లో ఏర్పాటు చేయమని అక్టోబర్‌ 30న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చి ఏడు నెలలు దాటినప్పటికీ నేటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వం మూడు ఏళ్ళు నిర్లక్ష్యం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగు నెలల్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రత్యేకించి లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పడుతున్న కష్టాలుపై కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళేవరని పేర్కొన్నారు. చౌకగా, సులువుగా పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే మానవ హక్కుల కమిషన్‌ అత్యవసరం అన్నారు. తక్షణమే మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ వికలాంగుల కమిషన్, ఆహార కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఎం రాజశేఖర్, పౌరహక్కుల సంఘం నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, ఐ సూర్యనారాయణ, జ్యోతి, దమయంతి, రవి, ఐద్వా నాయకులు రమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a reply